Blogger Widgets

గురువారం, నవంబర్ 22, 2012

కార్తీక పురాణం 9వ రోజు

గురువారం, నవంబర్ 22, 2012

అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతము:
జనకుడు వశిష్ఠులవారితో మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవడు? పూర్వజన్మలో ఎట్టిపాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగెనో వివరించమని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనకమహారాజుతో ఇట్లు పలికెను.
జనకా! అజామిళునిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుడుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుడిని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ వచ్చాము అని భయపడుతూ చెప్పిరి.
'ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇలా జరగలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును' అని యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని 'ఓహో! అదియా సంగతి! తన అవసాన కాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగానీ, తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా!' అని అనుకొనెను.
అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగానుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్టియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరించుచూ, శివాలయమలో ధూపదీప నైవేద్యాలను పెట్టక, దుష్టసహవాసములను చేస్తూ తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము పెట్టుకొనెను. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ, చూడనటుల ప్రవర్తించుచూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను, నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉన్నది. త్వరగా వంటచేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై భర్తను తూలనాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త నుండి చేతికర్రను లాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బైటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను.
భర్త ఇంటినుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి 'ఓయీ నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు' రమ్మని కోరెను. అంత ఆ చాకలి 'తల్లీ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను. చాకలి వాడునూ. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపుపని చేయజాలను' అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కలసి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి 'అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్ని సాక్షికా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి, క్షణికమైన కామవాంఛలకు లోనై మహాపరాధము చేసితిని' అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను.
కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా అతనిపాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికవల్ల భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు ఏదియో వ్యాది సంక్రమించి దినదినమూ క్షీణించుట చేత మరణించెను. అతడు రౌరవాది నరక కూపమన పడి నానాబాధలు అనుభవించి మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసినందువలన ఏడు జన్మముల పాపములు నశించుటచేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. దాంతో మాలవాడా శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. అదీ వారి పూర్వజన్మ వృతాంతము అని తెలిపెను.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటివారైననూ మోక్షమును పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణశ్రవణములు చేసివారు ఇహ, పర సుఖములను పొందగలరు.

బుధవారం, నవంబర్ 21, 2012

కార్తీక పురాణము 8వ రోజు

బుధవారం, నవంబర్ 21, 2012


విష్ణుదూతల, యమభటుల వివాదము
ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలం. వైకుంఠమునుండి వచ్చాము. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మన్నారో తెలిపమని ప్రశ్నించిరి.
దానికి బదులుగా యమదూతలు 'విష్ణుదూతలారా! మానవులు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రీ పగలూ, సంధ్యాకాలము సాక్షులుగా ప్రతిదినం మా ప్రభువు వద్దకు వచ్చి తెలుపుతారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే తెలుసుకుని ఆ మానవుని చివరిదశలో మమ్ము పంపించి వారిని రప్పించెదరు. పాలులెటువంటివారో వినండి... వేదోక్త సదాచారములను వీడి, వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలను చేసినవారునూ, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని చీదరించుకునేవారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను బాధించువారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని సైతం బాధించేవారు, చేసిన మేలును మరచిపోయేవాడు, పెండిండ్లు, శుభకార్యాలు జరగనివ్వక అడ్డుతగిలే వారూ పాపాత్ములు. వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి దండించమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ' కాబట్టి అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి చెడు సావాసాలకు లోనై, కులభ్రష్టుడై జీవహింసలు చేస్తూ, కామాంధుడై వావి వరసలు లేని పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు? అంటూ యమభటులు ప్రశ్నించిరి.
 
అంతట విష్ణుదూతలు 'ఓ యమకింకరులారా! మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మాలు ఎటువంటివో చెప్తాను వినండి. మంచివారితో స్నేహము చేయువారు, తులసి మొక్కలను పెంచువారు, బావులు, చెరువులు త్రవ్వించువారు, శివ కేశవులను పూజించేవారు, సదా హరినామాన్ని కీర్తించువారు, మరణ కాలమందు 'నారాయణా' అని శ్రీహరిని గాని, 'శివ శివా' అని పరమేశ్వరుణ్ని గానీ తలచినచో తెలిసిగాని, తెలియకగాని మరే రూపమునగాని శ్రీహరి నామ స్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున 'నారాయణా' అని పలుకుచూ చనిపోయెను. కాబట్టి మేము వైకుంఠానికే తీసుకుని వెళ్తామని పలికెను.
అజామిళుడు విష్ణు, యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యం పొంది 'ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి చనిపోయేవరకూ నేను శ్రీమన్నారాయణుని పూజగాని, వ్రతములు గాని, ధర్మములు గానీ చేయలేదు. నవమాసములు మోసి కనిపెంచిన తల్లితండ్రులకు కూడా నమస్కారం చేయలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల స్త్రీలతో సంసారము చేసి... నా కుమారునిపై ఉన్న ప్రేమతో 'నారాయణా' అని అన్నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు. ఆహా నేనెంతటి అదృష్టవంతుడ్ని. నా పూర్వ జన్మ సృకృతము. నా తల్లి తండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అంటూ సంతోషముగా విమానెక్కి వైకుంఠమునకు' వెళ్ళెను.
కాబట్టి ఓ జనక చక్రవర్తీ! తెలిసిగానీ, తెలియకగానీ నిప్పును తాకితే బొబ్బలెక్కి ఎంత బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని తెలిసీ తెలియకో స్మరించినంతనే సకల పాపాలనుండి విముక్తి పొందుటయే కాక మోక్షాన్ని కూడా పొందుతాము.

మంగళవారం, నవంబర్ 20, 2012

కార్తీక పురాణము 7వ రోజు

మంగళవారం, నవంబర్ 20, 2012


శ్రీ హరినామస్మరణ సర్వపలప్రదము:
వశిష్ఠుడు చెప్పిన విషయాలను విని 'మహానుభావా! మీరు చెప్పిన ధర్మములను శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు చిన్నదైనా పుణ్యము అధికంగా కలుగుతుంది. అదీ నదీ స్నానము, దీపదానము, పండుదానం, అన్నదానం, వస్త్రదానము వలన కలుగుతుందని చెబుతున్నారు. ఇట్టి చిన్న చిన్న ధర్మములవలన మోక్షము లభిస్తుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తే గానీ పాపములు తొలగవని మీవంటి శ్రేష్టులే చెప్పెను కదా. మరి మీరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెబుతున్నందుకు నాకు ఎంతో ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు ఆచారాలను పాటించక, వర్ణ సంకరులై మహా పాపములను చేసివారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదికాదా! కావున దీని మర్మమును తెలిపమని కోరెను.' వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా! నీవు అడిగిన ప్రశ్న నిజమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మాలు మూడు రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము పుట్టి ఫలమంతయును పరమేశ్వరునికి అర్పించి, మనస్సునందు ధర్మాన్ని పాటించిన ఆ ధర్మము ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను తొలగించి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను సమకూర్చును.  ఉదాహరణకు తామ్రపర్ణి నది యందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు నీరు పడినచో ధగాధగా మెరిసి, ముత్యమగు విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మాన్ని ఆచరించుచూ గంగా, యమునా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగున్న పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాలు పఠించి, సదాచారపరుడైన, గృహస్థుడైన బ్రాహ్మణునకు ఎంత చిన్న దానము చేసినా, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదుల్ని చేసినా విశేష ఫలాన్ని పొందుతారు. రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త ధర్మాలను వీడి చేసిన ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసో, తెలియకో ఏ చిన్న ధర్మాన్ని చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న మంట ఏర్పడినా మొత్తం భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగానీ, తెలియకగానీ తలచినచో వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు. దానికి ఓ చిన్న కధ కలదు.
అజామీళుని కథ:
పూర్వ కాలంలో కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి ఎంతో గుణవంతురాలైన హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు ఎంతో ఆదర్శంగా నిలిచి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేకలేక ఓ కుమారుడు జన్మించాడు. వారు అతడిని ఎంతో గారాభంగా పెంచుతూ అజామీళుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరుగుతూ అతి గారాభం వల్ల పెద్దల మాటను కూడా వినక, చెడు స్నేహాలు చేస్తూ, చదువును నిర్లక్ష్యము చేసి, బ్రాహ్మణ ధర్మాలను పాటించక తిరుగుచుండెను.  కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును వీడి, మద్యము తాగుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని మోహించి ఆమెతోనే కాపురం చేయుచుండెను. ఇంటికి కూడా పోకుండా ఆమె ఇంటనే భోజనం చేయుచుండెను. అతి గారాభం ఎలా చెడగొట్టిందో వింటివా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా చిన్ననాటి నుండి సక్రమంగా పెంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీళుడు కులాన్ని వీడడంతో అతని బంధువులు అతడిని విడిచి పెట్టారు.  అందుకు అజామీళుడు కోపంతో వేట వలన పక్షులను, జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒకరోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచూ కాయలను కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనె పట్టును తీసుకోబోతుండగా కొమ్మ విరగడంతో ఆమె చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీపై పడి కొంత సేపు ఏడ్చి, తరువాత అక్కడే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఓ కూతురు ఉంది. కొంత కాలానికి ఆ బాలిక పెరిగి పెద్దైనాక కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీళుడు ఆ బాలికతో కాపురం చేయుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఆ ఇద్దరు పుట్టగానే చనిపోయారు. మరల ఆమె గర్భము ధరించి ఒక కొడుకును కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనా విడువక, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తూ, నారాయణ, నారాయణ అని ప్రేమతో పెంచుకుంటున్నారు. కాని నారాయణ అని తలచినంతనే ఎటువంటి పాపాలైనా తొలగి పుణ్యాన్ని పొందవచ్చని వారికి తెలియదు. ఇలా కొంత కాలము జరిగిన తర్వాత అజామీళుడు అనారోగ్యంతో మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉండెను.  ఒకనాడు భయంకర రూపాలతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిళుడు భయంతో కొడుకుపై ఉన్న ప్రేమతో నారాయణా, నారాయణా అంటూ ప్రాణాలను వదిలెను. అజామిళుని నోట నారాయణా అన్న మాట వినగానే యమ భటులు గజగజ వణకసాగిరి.  అదే సమయానికి దివ్యమంగళాకారులు, శంకచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని భటులు కూడా విమానంలో అక్కడకు వచ్చారు. ఓ యమ భటులారా వీడు మావాడు. మేము ఇతన్ని వైకుంఠమునకు తీసుకువెళ్తాం అని చెప్తూ అజామిళుడుని విమానమెక్కించి తీసుకొని పోవడానికి సిద్ధమవ్వగా, యమదూతలు అయ్యా! మీరు ఎవరు? అతడు దుర్మార్గుడు. ఇతన్ని నరలోకానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము. కాబట్టి మాకు వదలమని కోరగా, విష్ణుదూతలు ఇలా చెప్పసాగెను.

సోమవారం, నవంబర్ 19, 2012

ఉరిమైఉరిమెను పిడుగైసాగె

సోమవారం, నవంబర్ 19, 2012

ఈరోజు వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జయంతి.  ఆమె జయంతి పురస్కరించుకొని ఇక్కడ కధని మరియు నాకు నచ్చిన మంచి ఇన్స్పెరేషణ్ పాట మీకోసం.




ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

తెల్లవారిపై నల్లత్రాచులా బుసలుకొట్టెను ఝాన్సీరాణి
నల్లమనసుల తెల్ల మనుషుల భరతంపట్టే ఝాన్సీరాణి
మీపాలిట యమదూతగమారి పాశంవిసెరెను లక్ష్మిబాయి
సాగదురాఇక మీపెత్తనము తప్పదురా మీ తిరుగుప్రయాణము

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

ఆత్మగౌరవము వెల్లువలాగా పెల్లుబికిన ఈఝాన్సీరాణి 
దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసుర మర్ధినిలాగ  
ఆటకట్టునీ ఆటకట్టునీ నీకపటాలన్ని కట్టిపెట్టు 
ఆంగ్లేయుడా ముటలుకట్టు నయవంచకుడా పయనంకట్టు

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

దుర్గాదేవి ఝాన్సీరాణి వీరనారి ఈనారీమణి 
నీపాలిట మృత్యువురా పారిపోండిరా ఆంగ్లేయులు 
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు 
నల్లమనసుల తెల్లమనుషులు   

వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను వీరనారి ఝన్సీరాణి 
ఆటకట్టు నీఆటకట్టు ఇకఆంగ్లేయుడా మూటకట్టు
వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)